లోక్ సభకు ముందు 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
2024 లోక్ సభ సాధారణ ఎన్నికలకు ముందు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయ్. 2014, 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ… మరోసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు సెమీ ఫైనల్స్ తరహాలో జరగనున్న 11 రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. లోక్ సభ ఎన్నికల కంటే ముందుగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఇప్పట్నుంచే ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటోంది. అటు ఉత్తరాది, ఈశాన్యం, దక్షిణాదిలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. కర్నాటకలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విజయం సాధిస్తే… 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇక తిరుగుండదని ఆ పార్టీ భావిస్తోంది. సెమీఫైనల్స్ ముందుగా హిమాచల్ నుంచి ఆరంభం కానున్నాయ్. హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ ప్రభుత్వం ముంది. తాజాగా హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 12 నోటిఫికేషన్ విడుదల కానుండగా.. డిసెంబర్ 8 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.

హిమాచల్ ఎన్నికల నోటిఫికేషన్‌తోపాటు, గుజరాత్ నోటిఫికేషన్ వస్తోందని అందరూ భావించారు. కానీ ఈసీ ప్రకటించలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫిబ్రవరి 18కి ఐదేళ్ల అసెంబ్లీ గడువు పూర్తవుతుంది. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాకు గుజరాత్ సొంత రాష్ట్రం కావడంతో పాటు రెండు దశాబ్దాలకుపైగా అక్కడ బీజేపీ గెలుస్తోండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారనుంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగుతోండటంతో ముక్కోణపు పోటీ అనివార్యమవుతోంది. ఇక మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నికలు 2023 మార్చికి అసెంబ్లీ గడువు పూర్తవుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు 24 మే, 2023లోగా నిర్వహించాల్సి ఉంది. మిజోరామ్ ఎన్నికలు 2023 డిసెంబర్ జరపాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో జనవరి 6 , ఛత్తీస్‌గఢ్‌లో జనవరి 3, రాజస్థాన్‌లో జనవరి 14లోగా ఎన్నికలను నిర్వహించాలి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను 2018 డిసెంబర్‌లో జరిగాయ్. జనవరి 16, 2024లోపు కొత్త అసెంబ్లీ ఏర్పాటు కావాలి. దీంతో తెలంగాణ అసెంబ్లీకి నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.