Home Page SliderTelangana

విషపత్రికలు రోత రాతలు… ఆ మీడియాపై నిప్పులు చెరిగిన ఈటల

కష్టపడి పైసా పైసా కూడబెట్టి.. రాజకీయాలకు వచ్చి ప్రజా సేవ చేస్తున్నానన్నారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అధికార ద్వారానే ప్రజలకు మేలు చేయొచ్చన్న సిద్ధాంతాన్ని మనసా, వాచా, నమ్మి అందుకు అనుగుణంగా రాజకీయం చేస్తున్నానన్నారు. ప్రజా సేవే పరమావధిగా రాజకీయాలు చేస్తున్న అతి కొద్ది మంది నాయకుల్లో తానొకరన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కటీఫ్ తర్వాత సొంతగా ప్రజల్లోకి వెళ్లి కమలం కండువా కప్పుకొని రాజకీయాలు చేశానని… వందల కోట్లు ఖర్చు పెట్టిన గులాబీ పార్టీని ఓడించి.. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందానన్నారు. తన విషయంలో కొందరు చేస్తున్న యాగీ, అనవసర ప్రచారం ఈ సమయంలో అసహ్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం, ప్రజలతో రాజకీయాలు చేసే ఈటల, బీజేపీ పెద్దల మనసులో స్థానాన్ని సంపాదించుకోడాన్ని జీర్ణించుకోలేని కొందరు చేస్తున్న అతిపై ఇవాళ మీడియా ముఖంగా ఆయన నిప్పులు చెరిగారు.

పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు కొన్ని పత్రికలు అంటూ ఆనాడే శ్రీ శ్రీ రచనను ఉదహరించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్. స్వీయ మానసిక ధోరణితో కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాల్లేకుండా ఉన్న వ్యక్తినన్నారు. ప్రజలను ప్రేమించడం మాత్రమే తెలుసునన్న ఈటల, కాలికి ముల్లు గుచ్చుకుంటే పన్నుతో తీసేవాడినన్నారు. శ్రమను, ధర్మాన్ని, ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నానన్నారు. పదవి తల్లిదండ్రులిచ్చేది కదాన్న ఈటల ప్రజల ఆశీర్వాదంతోనే వస్తుందన్నారు. ప్రధాని మోదీ తాను 140 కోట్ల ప్రజల సేవకుడనని అంటారని… అలాంటి వ్యక్తుల ఆధారంగానే తాను రాజకీయం చేస్తున్నానన్నారు. ఈ భూమ్మీద తనకు ఎవరూ శత్రువులు లేరన్నారు ఈటల. మీడియాను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయలేదని, పత్రికల ద్వారా పైకి రాలేదని, చానెల్ నమ్ముకొని ఎదగలేదని… ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తిని తానన్నారు. తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లిన గుర్తుపెట్టే స్థానాన్ని సంపాదించుకున్నానన్నారు. కేసీఆర్ టికెట్ ఇస్తే గెలిచానన్నందుకే.. చాలెంజ్ చేసి ఎన్నికలకు వెళ్లి 600 కోట్లు ఖర్చు చేసినా ప్రజల హృదయాల్లోంచి తొలగించలేకపోయారన్నారు. నాడు టీఆర్ఎస్ పెద్దలు, హుజూరాబాద్‌లో ఖాళీ లేకుండా ఫ్లెక్సీలు వేసినా.. తాను ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు. హుజూరాబాద్ తీర్పు ద్వారా అది నిజమైందన్నారు.

తప్పుడు వార్తలు రాసి తనను బీజేపీకి రాజీనామా చేయాలని కొందరు కోరుకుంటున్నారని… పార్టీలు మారడం బట్టలు మార్చడమంత తేలిక్కాదన్నారు ఈటల. కేసీఆర్ వెళ్లగొడితేనే టీఆర్ఎస్‌ నుంచి బయటకొచ్చానని… తనంతట తాను పార్టీ మారలేదని తేల్చి చెప్పారు. మంత్రిగా ఉండి కార్మికుల పక్షాన పోరాటం చేసిన చరిత్ర తనదన్నారు. ఆర్టీసీ సంఘాలను తీసేస్తే… కేసీఆర్ పుట్టక ముందే సంఘాలున్నాయని చెప్పిన చరిత్ర తనదన్నారు. మంత్రి పదవి కంటే జీహెచ్ఎంసీ కార్మికులే ముఖ్యమని చెప్పానన్నారు. రైతు బంధు గుట్టలకు కూడా ఇస్తుంటే.. ఎలా ఇస్తారని ప్రశ్నించానన్నారు. తాను పేదల పక్షాన పోరాడే వ్యక్తినని ఈటల తేల్చి చెప్పారు. బీజేపీ ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని, నేను బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరాలని… సొంత ఎజెండాతో పేపర్‌లో వార్తలు రాయొద్దన్నారు ఈటల. రోత రాతలు అని మీరే ఈరోజు పత్రికలో రాసారు. మరి మా మీద రోత రాతలు ఎందుకు రాస్తారని ఈటల ప్రశ్నించారు. ప్యాకేజీ ఇచ్చి వార్తలు రాయించికొనే వాన్ని కాదన్న ఈటల… తాను పత్రికలు రాస్తేనో ఛానళ్లు చూపిస్తే లీడర్ కాలేదన్నారు. బడుగు బలహీనవర్గాలకోసం పని చేస్తూ సొంతగా ఎదిగానన్నారు. అసెంబ్లీ వేదికగా బీసీల గురించి కొట్లాడనన్నారు. 250 రెసిడెన్షియల్ స్కూల్స్, ఆత్మగౌరవ భవనలు అందులో భాగంగా వచ్చినవేనన్నారు ఈటల. అసెంబ్లీలో తాను మాట్లాడితే సీఎం స్వయంగా ఈటలకు అవవాహన ఉందని చెప్పారన్నారు. ఈటల చెప్పినవన్నీ అమలు చేయండని ఆదేశించారన్నారు.

తనకు అట్యిటుడ్ ఉందని రాయడం విడ్డూరంగా ఉందన్నారు ఈటల. నాతో పంచాయితీ ఉందని ఒక్క మనిషి కూడా మాట్లాడరని… అదే తన కమిట్మెంట్మెంట్ అన్నారు. అసెంబ్లీలో నేను మాట్లాడితే వంద మంది ఎమ్మెల్యేలు బల్లలు చరిచారంటేనే నా పట్ల గౌరవం ఏంటనేది అర్థం చేసుకోవాలన్నారు. జ్వరం వచ్చింది అని పడుకున్న రోజు తన జీవితంలో లేదన్న ఈటల… ఉద్యమసమయంలో ఒకే రోజు 17 సభలకు హాజరయ్యానని ఇదే పత్రిక నాడు రాసిందని ఈటల గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై ఎందుకీ రాతలని ఈటల దుయ్యబట్టారు. ఇందిర పార్క్ దగ్గర ఎవరు టెంట్ వేసినా.. వెళ్లి మద్దతు ఇచ్చిన వ్యక్తి తానన్నారు. ఈ రాతలు మంచిది కాదని, వ్యక్తులు పద్దతి మార్చుకోవాలని… బురదజల్లడం మానేయాలని ఈటల హితవు పలికారు. మౌనం బలహీనత అనుకోవద్దన్నారు. పిచ్చి రాతలు మానేయాలని, ఆత్మగౌరవాన్ని కించపరిచే పనులు మంచివి కాదన్నారు ఈటల రాజేందర్.