‘ముడా స్కామ్’ విచారణలో ఈడీ ముందడుగు
బెంగళూరులో ముడా స్కామ్ సంచలనం రేపుతోంది. ఈ స్కామ్‌లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, అతని కుటుంబం ఉండడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. తాజాగా ఈడీ ఈ స్కామ్‌లో ఆధారాలు సేకరించే పనిలో పడింది. ఈ స్కామ్‌పై పిటిషన్ వేసిన సోషల్ యాక్టివిస్ట్ స్నేహమయి కృష్ణను విచారణకు పిలిచింది. అతని వద్ద గల పాన్, ఆధార్ వివరాలతో పాటు తన కంప్లైంటుకు సంబంధించిన డాక్యుమెంట్ల వివరాలను ఈడీ తీసుకుంది. ఈ మొత్తం స్కామ్‌లో సీఎం సిద్దరామయ్య కేవలం ఒక ఉదాహరణే అని, ఇలాంటి భూముల పంపిణీలు ఎన్నో జరిగాయని ఆయన పేర్కొన్నారు. అందుకే సమగ్ర విచారణకు ఫిర్యాదు చేశానన్నారు. దీనిలో ఎన్నో వేల కోట్ల కుంభకోణాలు జరిగినట్లు ఆరోపించారు. ముడా స్కామ్‌పై ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు స్నేహమయి కృష్ణ. దీనితో వివరాలు సమర్పించాలని ఈడీ ఆయనకు నోటీసులు పంపింది. అయితే సీఎం సిద్దరామయ్యపై ఈడీ కేసు నమోదు చేయడంతో ఆయన భార్య పార్వతి తనకు ముడా నుండి వచ్చిన ప్లాట్లను తిరిగి ముడా సంస్థకే ఇచ్చేస్తానని ప్రకటించారు.

