ఓటరు కార్డులపై ఈసీ క్లారిటీ
ఓటరు కార్డులకు సంబంధించి తాజాగా విస్తృతంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరమని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం, సెక్షన్ 31 కింద రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులు కలిగి ఉంటే, గరిష్ఠంగా ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడవచ్చని ఈసీ అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉంటే, ఒక దాన్ని మాత్రమే ఉంచుకొని మిగతావి సరెండర్ చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో రెండు చోట్ల పేరు ఉంటే, ఒక చోట తొలగించేందుకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ సూచించింది. ఇందుకోసం ఆన్‌లైన్ సౌకర్యం కూడా కల్పించినట్లు ఎన్నికల సంఘం స్పష్టంగా వివరించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మీడియా-పబ్లిసిటీ సెల్ చైర్మన్ పవన్ ఖేడాకు రెండు ఓటరు కార్డులు ఉన్నాయనే ఫిర్యాదుతో, ఇటీవల ఎన్నికల సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. దీనిపై ఖేడా స్పందిస్తూ, తాను గతంలోనే పేరును డిలీట్ చేయమని దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.