ఈ ఆహారాలు తింటే క్యాన్సర్ ముప్పు
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణానికి కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇది ప్రాణాంతక వ్యాధి. శరీర భాగాల్లో నియంత్రణ లేకుండా కణాలు పుట్టగొడుగుల్లా ఏర్పడే పరిస్థితిని క్యాన్సర్ అంటారు. ఇది శరీరంలో ఏ భాగానికైన సోకవచ్చు. ఈ మహమ్మారి కారణంగా ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. కోట్లాది మంది ఇప్పటికీ దీనితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్ సోకడానికి మన అలవాట్లు, వారసత్వం, వాతావరణ కాలుష్యంతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణం. ముఖ్యంగా కొన్ని ఆహారాలను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చాలా కాలం పాటు తీసుకుంటే అవి కడుపు క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన మాంసం, దానితో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినేవారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువని నిపుణులు తెలిపారు. ప్రాసెస్ చేసిన మాంసంతో చేసే పదార్థాల వల్ల కొన్ని రకాల కార్సినోజెనిక్ సమ్మేళనాలు ఏర్పడి అవి పెద్ద పేగు క్యాన్సర్ దారితీస్తున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
రెడ్ మీట్ అధికంగా తినేవారికి పెద్దపేగు, ప్రొస్టేట్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్కహాల్ అలవాటు కారణంగా యువతలో క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. అతిగా మందు తాగడం వల్ల కడుపు, పేగు, అన్నవాహిక, కాలేయం, ప్యాంక్రియాటిక్, రొమ్ము వంటి శరీర భాగాల్లో క్యాన్సర్ కణితులు ఏర్పడవచ్చు అల్కహాల్ కారణంగా శరీర కణాల డిఎన్ఏ మార్పులకు గురి కావచ్చు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. పాలు, జున్ను, పెరుగు వంటి పాల పదార్థాలను రెగ్యులర్ గా, అతిగా తింటే ప్రాస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. పాల ఉత్పత్తులు ఇన్సులిన్ లింక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 లెవల్స్ పెంచుతాయి. దీని ఫలితంగా ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
పండ్లు, కూరగాయాలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవాలి. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడి, డిఎన్ఏ నష్టాన్ని నివారిస్తాయి. ఫలితంగా క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. బాదం, అలిసె గింజలు, వాల్ నట్స్, గుమ్మడి విత్తనాలు, చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ కణాలపై పోరాడుతాయి. బీన్స్, పప్పు ధాన్యాలు వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలొరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.