తెలంగాణ బీజేపీకి ఈటల టానిక్, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని తెలంగాణలో బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈటల నేతృత్వంలో బీజేపీ దూకుడు ప్రదర్శించేందుకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో బీజేపీ అదృష్టాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏమేరకు మార్చుతారన్నదానిపై యాంబిగ్విటీ ఉంది. కేంద్ర నాయకత్వం తెలంగాణలో విజయం సాధించి తీరాలని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల వడపోత ప్రక్రియ పూర్తి చేసిన పార్టీ హైకమాండ్ అభ్యర్థుల ఎంపిక సమయంలో పూర్తిస్థాయిలో అనుసరించాల్సిన ప్రణాళికలను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో చర్చించనుంది. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సూచనలతో… వడపోత ప్రక్రియను పూర్తిచేసి త్వరలో అభ్యర్థుల జాబితాను పార్టీ ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలో పార్టీకి సానుకూలత కలిగేలా బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత… కాషాయం పార్టీకి మళ్లించేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బడుగు బలహీన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతన్న ఈటల, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఆయా వర్గాలను ఎన్నికల్లో నిలబెట్టి ప్రజల మద్దతు కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీ కార్యకర్తల్లో భరోసా కలిగించేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఈసారి ఎన్నికల్లో ఓడించకుంటే.. తెలంగాణలో సామాజిక సమీకరణాలు మారవన్న భావనను కలిగించేలా ఆయన టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు.