మల్కాజ్‌గిరిలో ఈటల గెలుపు నల్లేరుపై నడకే..!
గ్రేటర్ పరిధిలో హాట్ సీట్ మల్కాజ్‌గిరి
35 లక్షల ఓటర్లున్న నియోజకవర్గంగా రికార్డ్
సగం ఓట్ల మాత్రమే పోలయ్యే అవకాశం
హిందుత్వం, ఆంధ్రా నేపథ్యమున్న ఓటర్లు కీలకం
ఈటల రాజేందర్‌కు జైకొడుతున్న స్థానికులు
ఉద్యమవేళ బహుజనుల హృదయాలు గెలుచుకున్న ఈటల
గెలిస్తే మోదీ కేబినెట్‌లో మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం
మోదీ, అమిత్ షాతో ఈటల సత్సంబంధాలు
యూఆర్ రైట్… మల్కాజ్‌గిరిలో ఈటల గెలుపు నల్లేరుపై నడకే..! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఈటల గెలుపు ఖాయమంటున్నారు. తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు ఈటల రాజేందర్. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో బహుజనుల గొంతుకై నిలిచిన ఈటల తెలంగాణలో అణువణువునా ప్రజల మన్ననలు పొందారు. సాత్వికుడుగా, నిత్య కృషీవలుడిగా ఉండే ఈటల రాజేందర్ ఉద్యమ సమయంలో అటు ఆంధ్రా ప్రాంత ప్రజలతోనూ, ఇటు తెలంగాణ ప్రజల్లోనూ సఖ్యత కోసం పాడుపడ్డారు. విభజన ప్రాంతాల మధ్య కాదని, మనుషుల మధ్య మాత్రమేనని ఘంటాపథంగా చెప్పారు. విడిపోయినా, అందరం కలిసే ఉందామన్న విషయాన్ని పదే పదే చెప్పారు. ఆచరణలో నిజమని నిరూపించారు. తెలంగాణవాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటల రాజేందర్ రెండు ప్రాంతాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిమెలిసి జీవించాలని కోరారు. సౌమ్యుడిగా, నిఖార్సయిన తెలంగాణ బిడ్డగా, సమస్యల సాధకుడిగా పేరు పొందిన ఈటల ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొన్నారు. కేసీఆర్ ఖతం చేస్తామంటే ఇదేం ప్రైవేటు వ్యవహారం కాదని, హుజూరాబాద్ గడ్డపై గర్జించి, దొర పెత్తనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి, బీజేపీ అగ్రనేతల మన్ననలు పొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లు, 8 సీట్లు సాధించడంలో కీలకమయ్యారు. ఈటల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు ఘననీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను చాటుతోంది.

తాజాగా ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో అందరి దృష్టి మల్కాజ్‌గిరిపై పడుతోంది. ఈటల రాజేందర్ లాంటి సాత్వికుడు తెలంగాణలో అత్యున్నత పీఠాలను అధిరోహించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోడానికి ముఖ్య కారణం ఈటల అని గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధిస్తే, ఆయనే సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్నికల్లో బీజేపీ 14% ఓట్లతో తెలంగాణలో ప్రధాన శక్తిగా ఆవిర్భవించింది. దీంతో వచ్చే లోకసభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకోవాలని, 35 శాతం ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి…. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి నుంచి బరిలో నిలిచేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు చేయించుకున్న ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి గెలుపు నల్లేరు పై నడకేనన్న భావనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అత్తెసరు మెజార్టీతో అధికారాన్ని దక్కించుకోవడంతో… ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను రాబట్టే అవకాశం కన్పిస్తోంది. సహజంగా జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అంశాలు మాత్రమే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కన్పించనున్నాయన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరీ ముఖ్యంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనన్న ఫీలింగ్ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా ఎన్నికలను ఫేస్ చేయడం ఆషామాషీ కాదని కూడా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనన్న భావన ఉంది.

ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా నిలబడటం ద్వారా రేసు కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటం, దేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండటం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం ద్వారా, మోదీ క్యాబినెట్లో కీలక శాఖలు దక్కే అవకాశం ఉంద్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్ కమ్యూనిటీకి ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాదు బడగు, బలహీనవర్గాల గొంతుకగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి గెలిచి మోదీ క్యాబినెట్లో స్థానం సాధించగల నేతను పార్లమెంట్‌కు పంపడం సముచితమన్న భావన కూడా మల్కాజ్‌గిరి వాసుల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో ఆయన దృష్టి మల్కాజ్‌గిరిపై పెట్టారు. ఎంపీగా గెలిచేందుకు కావలసిన వ్యూహాలను రచిస్తూ, ఎన్నికల మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో సహజంగానే… బీజేపీకి కలిగే అడ్వాంటేజ్ పొజిషన్ మరింత చక్కగా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు.

ఇప్పటికే రాజేందర్ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఉన్న స్థానిక బీజేపీ నాయకుల అందరితోనూ మంతనాలు నిర్వహిస్తున్నారు. మల్కాజ్‌గిరి దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ మొత్తం ఓటర్లు 35 లక్షల మంది ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు పోలింగ్ నమోదవుతుందన్నది చూడాల్సి ఉంది. కేవలం సగం మాత్రమే పోలైనప్పటికీ ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటున్నారు ఈటల సన్నిహితులు. వాస్తవానికి మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో ఓటింగ్ 50 శాతం వరకు మాత్రమే జరుగుతోంది. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం, బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉంది. ఈ తరుణంలో ఈటల రాజేందర్‌కు మల్కాజిగిరిలో విజయం తేలికని బీజేపీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థి రేసులో ఉండటం ద్వారా నియోజకవర్గంతోపాటుగా, పక్కన స్థానాలపైనా ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లను ఖరారు చేయాలని బీజేపీ హైకామాండ్ సైతం భావిస్తోంది. దీంతో మల్కాజ్‌గిరి రేసులో చాలా మంది నాయకులున్నప్పటికీ… ఈటల ముందు వరుసలోని నిలిచారు. ఇప్పటికే స్థానికంగా నేతలతో చర్చిస్తున్న ఈటల ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన వ్యూహాలను పన్నుతున్నారు. మల్కాజ్‌గిరి ప్రాంతం ఓటర్ల అభిమానంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఈటల యోచిస్తున్నారు.


 
							 
							