ఏ మొఖం పెట్టుకొని ఆదిలాబాద్ ఓట్లడుగుతారు? కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన ఈటల
ఆదిలాబాద్‌లో బీజేపీ జనగర్జన సభ
ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా
కేసీఆర్ సర్కారును కడిగిపారేసిన ఈటల
కేసీఆర్ లక్ష కోట్ల దోచుసుకున్నారని ధ్వజం
తెలంగాణ రాష్ట్రం కోసం 24 గంటల పాటు, నేషనల్ హైవే దిగ్బంధించిన వారిలో ఇక్కడికి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నేను చచ్చిపోయిన పర్లేదు నాతోటివారికైనా ఉద్యోగాలు వస్తాయని ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని… ఆ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడితే ఆ ఫలితాలు అనుభవిస్తోంది కేసీఆర్, ఆయన కుటుంబం, వారి చుట్టాలని దుయ్యబట్టారు ఈటల రాజేందర్. మొన్న వచ్చిన వరదల్లో ఆదిలాబాద్‌లో ఉన్న స్వర్ణవాగు, గడ్డనవాగు పొంగి పక్కనున్న పొలాలు అన్ని మునిగిపోయి నష్టపోయిన మహిళలు కార్చిన కన్నీళ్లు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. కానీ వారికి ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ఇవ్వలేదు… కాని వేరే రాష్ట్రాల్లో మన డబ్బులు పంచిపెడుతున్నారని దుయ్యబట్టారు. 30 లక్షల మంది తెలంగాణ యువకులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను బర్తరఫ్ చేయాలని టీఎస్పీఎస్సీని కాదన్నారు ఈటల. కేసీఆర్‌ని గద్దెదించితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని… అప్పటివరకు నిద్రపోవద్దన్నారు.

తెలంగాణ వస్తే తెలంగాణ ఆడబిడ్డలంతా లక్షాధికారులు అవుతారని కేసీఆర్ చెప్పారు. కానీ వడ్డీ లేని రుణాల పైసలు కూడా ఇవ్వడం లేదని ఈటల విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద వారి వాటా టంఛన్‌గా మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నా.. నాలుగు సంవత్సరాలు అయినా కేసీఆర్ డబ్బులు ఇవ్వడం లేదని… బ్యాంకులలో మహిళా సంఘాల గ్రూపులు డిఫాల్ట్‌గా మిగిలిపోతున్నారని… మహిళలు రుణాలు తీసుకోవడానికి వీలు కాకుండా పోవడానికి కారణం కేసీఆరేనని ఈటల మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లేని రుణాల పైసలు చెల్లించే జిమ్మేదార్ తీసుకుంటామని చెప్పారు. వీవోఏలకు 5 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారందరికీ అండగా ఉంటామని ఈటల భరోసా ఇచ్చారు.

ధనిక రాష్ట్రం, రైతుల కోసం పుట్టిన, రైతుల కోసం పనిచేస్తున్న అని చెప్పిన కేసీఆర్ నాలుగున్నర సంవత్సరాలైనా రైతులకు రుణమాఫీ డబ్బులు విడుదల చేయలేదన్నారు. 7800 కోట్లకు రింగ్ రోడ్డు అమ్మి, మద్యం టెండర్లు వేసి, భూములు కుదువ పెట్టి డబ్బులు తెచ్చి రైతులకు రుణమాఫీ డబ్బులు ఇచ్చారన్నారు. పెన్షన్ సకాలంలో ఇవ్వడం లేదన్న ఈటల, నేటికీ రైతుబంధు పైసలు పూర్తిగా చెల్లించలేదన్నారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారింది.. దీని నుంచి బయటపడాలంటే.. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్‌ను బొంద పెట్టాలన్నారు. దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మోసం చేసిన కేసీఆర్, లక్షల కోట్లు సంపాదించుకున్నారన్నారు. బీఆర్ఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అవుతారు తప్ప వేరే వారికి అవకాశం లేదన్నారు.

52 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని… అన్ని వర్గాలను కేసీఆర్ అవమానపరిచారన్నారు. కేసీఆర్‌కి బుద్ధి చెప్పాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీని గెలిపించమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపిస్తే… రేపటి బంగారు తెలంగాణకు బాటలు వేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారకు. డబుల్ బెడ్ రూమ్ రావాలన్నా, పెన్షన్ కొనసాగాలన్నా, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావాలన్న.. ఇచ్చే సత్తా శక్తి బీజేపీకి మాత్రమే ఉందని ఈటల చెప్పారు. బిజెపిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు ఈటల విజ్ఞప్తి చేశారు.