అక్టోబర్ 15 నుండి ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు
దసరా ఉత్సవాలకు పేరెన్నిక గన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుండి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగబోతున్నాయి. అక్టోబర్ 15 నుండి 24 వతేదీ వరకూ ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. దసరా ఏర్పాట్లకు సంబంధించి కేవలం ఇంజనీరింగ్ వర్క్స్‌కు మాత్రమే రూ.2.5 కోట్లు ఖర్చు చేశారు. పలు ఇతర దేవాలయాల నుండి కూడా 200 మంది సిబ్బందిని తరలించి నవరాత్రులలో వారి సేవలను ఉపయోగిస్తామని అధికారులు తెలియజేశారు. అంతేకాక సెక్యూరిటీ, అన్నదానాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ నవరాత్రి రోజులలో దుర్గమ్మ వివిధ దేవతా మూర్తుల అలంకారంలో దర్శనమివ్వనున్నారు. తొలిరోజు అక్టోబర్ 15నాడు బాల త్రిపురసుందరిగా దర్శనమిచ్చే అమ్మవారు తరువాత రోజులలో వరుసగా గాయత్రీమాత, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి, లలితా త్రిపురసుందరీదేవీ, సరస్వతీ దేవి, దుర్గాదేవి, మహిషాసురమర్థిని అలంకారాలలో మహా నవమి వరకూ దర్శనమిస్తారు. చివరి రోజైన విజయదశమి నాడు రాజరాజేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఈ అలంకారాలు వైదిక పద్దతిలో జరుగుతాయని కమిటీ సభ్యులు తెలియజేశారు.

