బతుకమ్మ చీరలు రాజకీయం చేయొద్దు…కేసీఆర్
బతుకమ్మ చీరల పథకం కేవలం చేనేత కార్మికులకు పని కల్పించేందుకే అమలు చేస్తున్నామని, దీనిని రాజకీయాలతో ముడి పెట్టవద్దని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. ఈ చీరల వల్ల రూ.300 కోట్ల నుండి రూ.400 కోట్ల రూపాయలు చేనేత పరిశ్రమలకు పని దొరుకుతోందన్నారు. నేడు సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ..ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగేవని, అప్పుడు ఏడుపు వచ్చేదని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను తొలగించాలని కాంగ్రెస్, బీజేపీలు అబద్దపు మాటలు చెప్తున్నారని, కానీ ధరణి పోతే తెలంగాణలో రైతులు చాలా ఇబ్బంది పడతారని, కావాలో, వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, గుజరాత్‌లో మోదీ కూడా ఇవ్వలేకపోయారని, 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కూడా ఇవ్వలేకపోయిందన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి, ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

