Andhra PradeshHome Page Slider

‘చంద్రబాబుకు ఓట్లడిగే దమ్ముందా’ టిడ్కో ఇళ్ల పంపిణీ సభలో సీఎం జగన్

పేదలకు ఏనాడూ మంచి చేయని చంద్రబాబు ఇంకో ఛాన్స్ ఇస్తే అది చేస్తా.. ఇది చేస్తా.. ఇంటికో కేజీ బంగారం ఇస్తా.. ఓ బెంజ్ కారు ఇస్తా.. అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి పేదలకు ఇది నేను చేసిన మంచి అని చెప్పుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని,  40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి చివరికి కుప్పంలో కూడా  పక్కా ఇళ్లు కట్టని చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని నాకు ఉత్తరం రాసి కోరుకుతున్నారన్నారు. తాను కేవలం నాలుగేళ్ల పాలనలో నవరత్నాల పథకాల కింద రూ. 2.16 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చానని, 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లను కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో లబ్ధిదారులకు ఇస్తున్నామని పేర్కొన్నారు.

పేదల అండతో, పేదల్లోంచి, కష్టం నుంచి పుట్టిన పార్టీ మనది అన్నారు. చంద్రబాబు నిత్యం పొత్తుల్ని, ఎత్తుల్ని, కుట్రల్ని నమ్ముకున్నారు. 175 నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యే అభ్యర్థులను నిలపలేని టీడీపీ మన ప్రత్యర్థా.. చంద్రబాబు కోసమే పుట్టిన ప్యాకేజీ స్టార్, ఎల్లో మీడియా మరో సారి రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్రలు చేస్తోంది అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయపాలెంలో  77 ఎకరాల ఒకే లేఅవుట్ లో నిర్మించిన 8, 912 టిడ్కో ఇళ్లను సీఎం జగన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం పంపిణీ చేసిన మొత్తం టిడ్కో ఇళ్ల నిర్మాణంలో భాగంగా గృహ నిర్మాణం, మౌలిక వసతులు, స్థల సేకరణ కోసం ప్రభుత్వం రూ. 799.19 కోట్లు ఖర్చు చేసినట్లుగా సీఎం జగన్ పేర్కొన్నారు.