HealthHome Page SliderNational

మందులు అతిగా వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?

కొందరు ప్రతి చిన్న నొప్పికి వెంటనే మందులు వాడుతూ ఉంటారు. ఇలా ప్రతీ సమస్యకు మందులు వాడడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఇలా అతిగా మందులు వాడడం వల్ల ఒక్కొక్కసారి సమస్య తీవ్రమవడంతో పాటు ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉంది. అసలు అనారోగ్యం ఏమిటో సరిగ్గా అవగాహన లేకుండా మందులు వేసుకోవడం, డాక్టర్ల సలహా తీసుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అతిగా మందులు వాడడం వల్ల ఆ ప్రభావం కిడ్నీలపై పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. కిడ్నీల పనితీరు దెబ్బతిని, వాటి ఆయుర్థాయం తగ్గుతుంది. కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్ కలుగజేస్తాయి.

ప్రతీ మనిషి ఎత్తు, బరువును బట్టి, అనారోగ్యాన్ని బట్టి వైద్యులు మందులు సూచిస్తారు. సొంతంగా మందులు వాడడం వల్ల వారికి ఆ మందులు పనిచేయకపోవచ్చు. లేదా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉండేవారు మద్యం సేవించిన తర్వాత మందులు వాడకూడదు. ఇలా వాడితే దీర్ఘకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల మందులను ఒకేసారిగా వేసుకోకూడదు. ప్రతీ టాబ్లెట్‌కీ కొంత సమయం ఇచ్చి వాడవలసి ఉంటుంది. లేకపోతే ఆ మందులలో రసాయనాలు ఒకదానికొకటి సరిపడక రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కొక్కసారి ట్యాబ్లెట్ వేసుకున్న సంగతి మరిచిపోయి మరోసారి వేసుకోవడం వల్ల కళ్లు తిరిగినట్లుడడం, నీరసం, నిసత్తువ, నోరు ఆరిపోవడం వంటి లక్షణాలు కనపడవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.