Breaking NewscrimeHome Page SliderTelangana

పాత‌బ‌స్తీలో మెట్రో ప‌నులు చేప‌ట్టొద్దు

హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పనులు కూడా మొదలుపెట్టింది. అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీలో మెట్రో పనులు ఆపాలంటూ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. ఈ ప్రజా ప్రయోజన వాజ్యాన్ని పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల సమయం కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా ఎంజీ బస్‌ స్టేషన్‌ నుంచి ఓల్డ్‌ సిటీలోని చాం ద్రాయణ గుట్ట వరకు మెట్రోని విస్తరించేలా పనులు చేపట్టింది ప్రభుత్వం.7.5 కిలోమీటర్ల పొడవైన మెట్రోను ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఫేస్‌-2లో ఇది మొదటి కారిడార్‌ కానుండగా ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులను సేకరించేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో 800 ఆస్తులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను పలు దఫాలుగా జిల్లా రెవెన్యూ అధికారులు చేపట్టారు. మొదటి దశ ప్రైవేట్‌ ఆస్తులకు పరిహారాన్ని చెల్లించడం మొదలైంది. అదే సమయంలో కొన్నిచోట్ల కూల్చివేతలు ప్రారంభించారు. ప్రాజెక్టుకు భూములు స్వచ్ఛందంగా ఇచ్చే యజమానులతో సంప్రదింపులు చేస్తూనే, సమస్యాత్మక ఆస్తుల సేకరణపై అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పనులు ఆపాలంటూ పిల్‌ దాఖాలు కావడం చర్చనీయాంశంగా మారింది.