NationalNews

దీపావళి ఆఫర్ రూ. 80 వేల లోపు ఓలా E-స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇప్పటికే పలు వేరియంట్లను విడుదల చేసిన ఓలా, దీపావళి సందర్భంగా తన వినియోగదారుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అతి చౌకధరలో కొత్త వేరియంట్‌ను వినియోగ దారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. రూ.80 వేల లోపు ధరకే ఈ కొత్త వేరియంట్‌ స్కూటర్‌ను అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఓలా ఎస్‌1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొత్త వేరియంట్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ సీఈవో భావిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. అక్టోబర్ 22న కంపెనీ దీపావళి ఈవెంట్ జరగబోతోంది. తమ అతిపెద్ద ప్రకటనలలో ఇది కూడా ఒకటి. త్వరలో కలుద్దాం అంటూ అగర్వాల్ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి ఒక టీజర్‌ కూడా విడుదల చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ ..ఎస్‌1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ రూ.99,999లకు భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తోంది. ఓలా ఎస్‌1, ఓలా ఎస్‌1 ప్రో ఈ-స్కూటర్లు ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది సుజుకి యాక్సెస్, టీవీఎస్ జూపిటర్ వంటి ప్రముఖ 125సీసీ స్కూటర్‌లకు పోటీ ఇస్తోంది. ఇటీవల హీరో మోటోకార్ప్ కూడా రెండు వేరియంట్లను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.