రాహుల్ గాంధీ తర్వాత మరో ఎంపీపై అనర్హత వేటు!?
ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు, కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్‌స్టర్- పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీని దోషిగా నిర్ధారించింది. పదేళ్ల జైలు శిక్ష విధించిన కొన్ని గంటల తర్వాత, ఆయన సోదరుడు, బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీని కోర్టు అదే కేసులో దోషిగా నిర్ధారించింది. 2007 గ్యాంగ్‌స్టర్స్ చట్టం కేసులో కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ముక్తార్ అన్సారీకి ₹ 5 లక్షలు, అఫ్జల్ అన్సారీకి ₹ 1 లక్ష జరిమానా సైతం విధించింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో సోదరులు నిందితులుగా ఉన్నారు. హత్య కేసులో దోషిగా తేలడంతో, అఫ్జల్ అన్సారీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది.

పార్లమెంటు నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడిన సభ్యులు వారంతట వారే అనర్హులవుతారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించబడి, కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇదే నియమం ప్రకారం ఆయన ఎంపీ హోదాను కోల్పోయారు. 2005లో ఘాజీపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను ముఖ్తార్ అన్సారీ, సోదరుడు అఫ్జల్ అన్సారీ హత్య చేశారు. కోర్టు తీర్పుతో న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం కుదిరిందని దివంగత ఎమ్మెల్యే భార్య చెప్పారు. యూపీలో మాఫియా పాలన అంతమైందని, న్యాయవ్యవస్థను తాను నమ్ముతానన్నారు. గూండాలు, మాఫియాల పాలనకు ఫుల్ స్టాప్ పడిందన్నారు.