గ్రోక్ ఏఐతో క్షమాపణలు చెప్పించుకున్న దర్శకుడు..
ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐ ఛాట్‌బాట్ పలు వివాదాలలో చిక్కుకుంటోంది. ఇటీవల హిందీలో బూతులు మాట్లాడి విమర్శలు పొందిన ఏఐ తాజాగా ఒక బాలీవుడ్ దర్శకుడికి క్షమాపణలు చెప్పింది. బీటౌన్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రికి గ్రోక్ క్షమాపణలు చెప్పింది. అసలు విషయమేమిటంటే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించే వ్యక్తుల జాబిలాతో వివేక్ పేరు చూపించింది. ఈ పోస్టును షేర్ చేసిన వివేక్ మండిపడ్డారు. నన్ను ట్యాగ్ చేస్తూ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఈ విషయంలో బహిరంగ వివరణ ఇవ్వాలని, ఇలాంటి సమాచారం వల్ల కొందరు వ్యక్తులు తనకు, తన కుటుంబానికి ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందన్నారు. కొన్నేళ్లుగా క్రియేటివ్ సినిమాలు తీస్తూ ప్రజలకు ఎన్నో విషయాలు తెలియజేస్తున్న తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. దీనితో వివేక్ అగ్నిహోత్రికి గ్రోక్ క్షమాపణలు చెప్పింది. తనను క్షమించమని, కొన్ని సోర్స్‌ల ఆధారంగా మీ పేరును ఆ లిస్టులో చేర్చానని, ఇకపై అలా జరగదని, వాస్తవాల ఆధారంగానే సమాధానాలు చెప్తానని పేర్కొంది. మీకు, మీ కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నానని వివరించింది. దీనితో ఏఐతో క్షమాపణలు చెప్పించుకున్న మొదటి వ్యక్తి మీరు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.