Home Page SliderInternational

ఇంతకీ ఇండియాకు మాల్దీవులు 28 దీవులను అప్పగించిందా?

ఇండియాపై మాల్దీవులకు అంతలోనే అంత ప్రేమ ఎందుకు?
28 దీవులను ఎందుకు అప్పగించిందన్న ప్రచారం ఎవరి పని?

పొరుగు దేశాలతో శాంతి, సఖ్యత, సౌభ్రాతృత్వాన్ని కోరుకోవడం కోసం భారతదేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. పొరుగుదేశాలు, దేశంలో అశాంతి రగిలించాలని ప్రయత్నించినా, ఇండియా మాత్రం శాంతి మంత్రం జపిస్తోంది. ఎందుకంటే సరిహద్దులను మార్చుకోవడం ఎవరి తరం కాదు కాబట్టి. అందులో భాగంగానే ఇండియా పట్ల ప్రేమగా ఉండే మాల్దీవులు ఒకేసారి, మన దేశం పట్ల విముఖత వైఖరి ప్రదర్శించినప్పటికీ ఇండియా రెచ్చిపోలేదు. పైగా, శాంతిని జపించింది. దీంతో ఎవరు మంచి, ఎవరు చెడ్డ అన్న విషయంపై ఆ దేశానికి క్లారిటీ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఇండియాకు ఆ దేశం రెడ్ కార్పెట్ పరుస్తోంది.

భారతదేశం క్రెడిట్ లైన్ (LoC) మద్దతుతో మాల్దీవుల్లో ఒక భారీ ప్రాజెక్టును రెండు దేశాలు ప్రారంభించాయి. విదేశాంగ మంత్రి S జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మాల్దీవులలోని 28 ద్వీపాలలో నీరు, మురుగునీటి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్, రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశగా గుర్తించబడింది. జైశంకర్ మాల్దీవుల పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవం జరిగింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత భారతదేశం, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఈ పరిణామం జరిగింది. మాల్దీవుల నాయకుడు ప్రధాని మోదీని కించపరిచే పదజాలాన్ని ఉపయోగించడంతో ఈ పర్యటన వివాదానికి దారితీసింది. దీంతో పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. అదే సమయంలో చైనా అనుకూల వైఖరి ‘ఇండియా అవుట్’ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు ముయిజ్జూ గతంలో ద్వైపాక్షిక సంబంధాలపై నీళ్లు జల్లారు. ఇదంతా గతం. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది.

ఈ సందర్భంగా ఇండియాకు మాల్దీవులు 28 దీవులను ఇచ్చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఐతే ఇదంతా అబద్ధమని విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేదా ఒప్పందాలు లేవని స్పష్టం చేసింది. జైశంకర్ పర్యటన సందర్భంగా కొందరు మాల్దీవులకు చెందిన 28 దీవులను ఇండియా “కొనుగోలు చేసిందని” పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఒప్పందంపై అధ్యక్షుడు ముయిజు స్వయంగా సంతకం చేశారని కూడా రాశారు. ఆ దీవుల నుంచి 50 మీటర్ల వ్యవధిలోనే లక్షద్వీప్ ఉంటుందని రాసుకొచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల మూడు రోజుల మాల్దీవుల పర్యటన సందర్భంగా తప్పుడు సమాచారం ప్రచారమైంది. మాల్దీవులు, ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన తర్వాత, మన దేశానికి చెందిన అత్యున్నత నేత ఆ దేశం వెళ్లడం ఇదే తొలిసారి.

ఐతే అధ్యక్షుడు ముయిజ్జూ ఆగస్టు 12న భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టడంతో సీన్ మారింది. ఆ దేశానికి అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా ఇండియా సహాయసహకారాలు అందిస్తూనే ఉందని, భారతదేశం ఎల్లప్పుడూ మాల్దీవులకు అత్యంత సన్నిహిత మిత్రదేశాలలో ఒకటిగా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. ప్రెసిడెంట్ ముయిజ్జూ ప్రధాని మోదీకి, భారతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నంలో, భారతదేశం- మాల్దీవులు అనేక అవగాహన ఒప్పందాలు (MOUలు) సంతకం చేశాయి. భారతదేశంలోని 1,000 మంది మాల్దీవుల పౌర సేవకులకు శిక్షణ ఇవ్వడం, మాల్దీవులలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ప్రవేశపెట్టడం ఒక కీలక ఒప్పందం. తన పర్యటనలో, జైశంకర్ ఆరు హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను (HICDPs) ప్రారంభించారు. మాల్దీవుల అభివృద్ధిలో భారతదేశం పాత్రను ఆయన వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్న కారణంగా మాల్దీవులు ఆర్థిక, దౌత్యపరమైన సవాళ్లను ఎదుర్కొంది. భారతదేశం పట్ల ప్రెసిడెంట్ ముయిజ్జూ వైఖరిలో మార్పును మాల్దీవులలోని ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి.