మతిమరపు పోగొట్టే వ్యాయామం
సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కుంటుపడతుంది.దీనివల్ల మతిమరపు వచ్చే అవకాశాలున్నాయి. దీనికి చక్కని పరిష్కారం వ్యాయామమే అంటున్నారు వైద్యులు. వయస్సుతో పాటు అధిక రక్తపోటు వల్ల కూడా డిమెన్షియాలో ఆలోచనా సామర్థ్యం, గ్రహణ శక్తి తగ్గుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే రోజువారీ వ్యాయామం మంచి మార్గమని తేల్చారు. బీపీ, షుగర్ ఉండేవారు, వయస్సు పైబడినవారు శారీరక శ్రమ, వ్యాయామంతో జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు తగ్గించుకోవచ్చని అమెరికాలోని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. జ్ఞాపక శక్తి మెరుగు పడాలంటే కాస్త కఠిన వ్యాయామమే చేయవలసి రావచ్చు. గుండె, శ్వాస వేగాన్ని పెంచే వ్యాయామాలు చేస్తే మతిమరపు వచ్చే అవకాశాలు తగ్గుతున్నట్లు పరిశోధనలలో తేలింది. 75 ఏళ్ల లోపువారు వారి శక్తికి తగినట్లు కఠిన వ్యాయామాలు చేస్తే ఈ ముప్పు నుండి తప్పించుకోవచ్చు.

