Home Page SliderTelangana

ప్రధాని మోడీ పర్యటనపై సీఎస్ రివ్యూ

అక్టోబరు 3న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్‌ పర్యటనకు సంబంధించి సంబంధిత శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ప్రధాని పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. రామ‌గుండం ఎన్‌టీపీసీ 800 మెగావాట్ల ప్రాజెక్టును వర్చువల్‌గా ఆ రోజున ప్ర‌ధాన మంత్రి ప్రారంభించనున్నారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అదేవిధంగా అగ్నిమాపక, ఆరోగ్య, విద్యుత్‌, రోడ్లు భవనాలు తదితర శాఖలు కూడా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నిజామాబాద్ కలెక్టర్, సి.పి. సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, అదనపు డీజీ స్వాతి లక్రా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, పోలీస్, ఎన్.టి.పి.సి, బీఎస్‌ఎన్‌ఎల్, అగ్నిమాపక, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు.