అమెరికాలో సంక్షోభం..వేలమంది వర్కర్ల తొలగింపు
అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం డెమోక్రాట్లపై ఒత్తిడి పెంచేందుకు షట్ డౌన్ చర్యలు ప్రారంభించింది. దీనితో అమెరికాలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇప్పటికే లేఆఫ్స్ మొదలయ్యాయని, 7 ఏజెన్సీలలో 4 వేల మందికి పైగా వర్కర్ల తొలగింపు చేసినట్లు వైట్ హౌస్ ఆఫీస్ తెలిపింది. ఈ చర్యలు ప్రధానంగా డెమొక్రాట్లకు అనుకూలమైన శాఖలపై జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం అక్టోబర్ 1, 2025న షట్‌డౌన్ ప్రారంభించింది. ఈ షట్ డౌన్ ప్రధానంగా ఆరోగ్య బీమా సబ్సిడీల పొడిగింపు, మెడికల్ ఎయిడ్ కట్స్ వంటి అంశాలపై డెమొక్రాట్లతో జరుగుతున్న వివాదాల కారణంగా కొనసాగుతోంది. ఫలితంగా సుమారు 900,000 మంది ఫెడరల్ ఉద్యోగులు నిరుద్యోగ సెలవుల్లోకి వెళ్లారు, మరో 700,000 మంది వేతనాలు లేకుండా పనిచేస్తున్నారు. మహిళలు, పిల్లలకు పోషణ కార్యక్రమం కొనసాగించేందుకు 300 మిలియన్ డాలర్ల అత్యవసర నిధులు మాత్రమే విడుదలయ్యాయి. అయితే, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు కూడా నిలిపివేయబడినాయి. పార్కులు, చిన్న వ్యాపార రుణాలు, ఆర్థిక డేటా విడుదల, విమాన ప్రయాణాల ఆలస్యం వంటి సేవలు ఈ షట్ డౌన్ వల్ల ప్రభావితమయ్యాయి. తద్వారా, విమాన సేవలు, కోర్టు కార్యకలాపాలు, పోషణ సహాయం వంటి సేవలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.