NewsTelangana

ఆయిల్‌ పామ్ తోటలు..

తెలంగాణలో మరో అటవీ ప్రాంతం సృష్టి!

–పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర

–ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ను గ్రహించి అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో సాధారణ అటవీ ప్రాంతానికి తోడుగా కొత్త అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ ఆయిల్ పాం పథకం ఈ కొత్త అడవిని సృష్టిస్తోంది. ఆయిల్ పాం సాగుకు, అటవీ అభివృద్ధికి సంబంధమేమిటి. అనే ప్రశ్న తలెత్తడం సహజం. కానీ, ఈ రెండింటికీ సంబంధం ఉంది. పర్యావరణానికి అడవులు ఎంత ముఖ్యమో.. ఆయిల్‌పాం చెట్లకూ అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సాధారణ చెట్లతో పోల్చితే ఆయిల్‌పాం చెట్లు పర్యావరణానికి ఎక్కువ మేలు చేస్తాయని పలుపరిశోధనల్లో వెల్లడైంది. ఆయిల్ పాం చెట్లను పర్యావరణానికి ఊపిరితిత్తులలాంటివి.

ఈ చెట్లు ఆక్సిజన్‌ను అధికంగా విడుదల చేస్తాయి:

సాధారణ చెట్లతో పోల్చితే ఆయిల్ పాం చెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. పలు దేశాల్లో జరిగిన పరిశోధనల ప్రకారం.. కార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరించి, అధిక ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ఆయిల్ పాం చెట్లు సపోర్ట్ చేస్తున్నాయి. అంతేకాదు, పలు పంటల సాగుతో పోల్చితే ఆయిల్ పాం సాగుకు తక్కువ నీరు, ఎరువుల వాడకం తక్కువ. ఒక ఎకరం వరిసాగు కోసం అవసరమయ్యే సాగునీటితో నాలుగు ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయొచ్చు. వరదల సమయంలో నేలలోని మృత్తికలు కొట్టుకుపోకుండా కాపాడతాయి. ఈ పంట సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని పరిశోధనలో తేలింది.