NationalNews Alert

లోన్ యాప్ వేధింపులతో దంపతుల ఆత్మహత్య

ఇటీవల కాలంలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు ఎక్కువైపోయాయి. లోన్ యాప్ వేధింపుల కేసులు రోజుకొకటి బయటపడుతున్నాయి. నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. కుటుంబ అవసరాల కోసం లోన్ యాప్‌లో రుణం తీసుకున్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. అవసరం లేకపోయినా ఒత్తిడి చేసి లోన్ ఇస్తున్న ఆన్‌లైన్ యాప్స్. లోన్ తీసుకున్న 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని బాధితులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న యాప్స్. అలా తీర్చకుంటే ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులు. ఈ బెదిరింపులు తాళలేక ఇప్పటికే అనేక మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.

వీటి కారణంగా  రాజమండ్రిలో పచ్చని జంట బలైంది.దీంతో మరో కుటుంబం రోడ్డున పడింది. . అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, రామలక్ష్మి దంపతులకు మూడేళ్లు, రెండేళ్ల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య మిషన్ కుడుతూ సంపాదిస్తుండగా, భర్త జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరు కొద్ది రోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్ ఫోన్ ద్వారా లోన్ యాప్ ద్వారా కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే సకాలంలో చెల్లించక పోవడం, వడ్డీ పెరిగిపోవడంతో టెలికాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు. తల్లిదండ్రులు కొల్లి దుర్గారావు,రమ్యలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటంతో అభం శుభం తెలియని చిన్నారులు నాగసాయి తేజస్వి,లిఖితశ్రీ అనాథలయ్యారు. అయితే ఈ హృదయ విదారక ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. చిన్నారులకు తక్షణమే రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతే కాకుండా పిల్లల సంరక్షణ కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌‌ను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో లోన్ యాప్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.