Home Page SliderNational

భారత్‌లో వేగంగా విజృంభిస్తున్న కరోనా..

కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి చెందడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లోని 17 రాష్ట్రాలలో ఇప్పటికే కరోనా కేసులు వెలుగు చూశాయి. శనివారం వెల్లడించిన నివేదికలను బట్టి కొత్తగా 423 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు 3,420కి చేరింది. తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 8 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే కేరళలో ఇద్దరు, కర్ణాటక, రాజస్థాన్‌లలో ఒక్కరు వైరస్‌తో మరణించారు. అయితే ప్రజలు ఎక్కువగా ఆందోళనకు గురికావద్దని, కేసులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందుజాగ్రత్తలు పాటించి, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాలలో మాస్కులు పెట్టుకోవడం, జలుపు, ఫ్లూ వంటి రుగ్మతలకు మందులు వాడడం, చేతులు పరిశుభ్రంగా కడగడం వంటి కొవిడ్ నియంత్రణ పద్దతులు పాటించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా కొవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి, కేసుల విషయంలో ఎప్పటికప్పుడు నివేదికను అందించాలని కేంద్రం ఆదేశించింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, గొంతునొప్పి, వాసన, రుచి కోల్పోవడం, శ్వాసకోశ సమస్యలు  వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవడం మంచిదని ఆరోగ్యశాఖ ప్రకటించింది.