Home Page SliderNational

మేఘాలయలో బీజేపీతో కలిసి పనిచేస్తామంటున్న సీఎం కాన్రాడ్ సంగ్మా

మేఘాలయ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ చెప్పినట్టుగానే వస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కన్పించడం లేదు. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) 60 సీట్లలో దాదాపు 25 స్థానాల్లో ముందంజలో ఉంది, తొలి ట్రెండ్‌లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మేఘాలయలో మెజారిటీ మార్క్ 31. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యుడిపి) తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బిజెపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వరుసగా ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాన్రాడ్ సంగ్మా ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుకు దూరం జరిగారు. ఐతే త్వరలో ఆయన బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం కన్పిస్తోంది.

ఒకవేళ ఫలితం పూర్తిగా అనుకూలంగా లేనట్టయితే… ప్రభుత్వ ఏర్పాటు కోసం జాతీయ స్థాయిలో, మేఘాలయకు మేలు కలిగించే పార్టీతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే కాన్రాడ్ సంగ్మా తేల్చి చెప్పారు. సర్వేలన్నింటిలోనూ ఎన్‌పీపీకి 20 సీట్ల వరకు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా 2018లో రాష్ట్రంలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఆరు సీట్లు గెలుచుకుని తన సంఖ్యను స్వల్పంగా విస్తరిస్తుందని అంచనా వేశాయి. కాంగ్రెస్ ఆరు సీట్లు గెలుచుకోవచ్చని, కొత్తగా మేఘాలయలోకి అడుగు పెట్టిన తృణమూల్ కాంగ్రెస్ 11 సీట్లతో ఖాతా తెరవవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. 2018లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ… NPPతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

సంగ్మా పార్టీపై అవినీతి ఆరోపణలతో విభేదాలు రావడంతో ఈసారి రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఫిబ్రవరి 27న రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 స్థానాల్లో పోలైన ఓట్లను రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో లెక్కిస్తున్నారు. అభ్యర్థి మృతితో సోహియాంగ్ స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. కౌంటింగ్ కేంద్రాల రక్షణ కోసం 22 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ ఆర్ ఖార్కోంగోర్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. షిల్లాంగ్‌లో 14, తురాలో 11 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మంది పరిశీలకులను నియమించారు. మార్చి 4 సాయంత్రం 4 గంటల వరకు విజయోత్సవ ఊరేగింపులను ఎన్నికల సంఘం నిషేధించింది.