Andhra PradeshHome Page Slider

14 ఏళ్లుగా గడపదాటని భార్య-హౌస్‌ అరెస్ట్ చేసిన లాయర్ భర్త

Share with

పోలీసుల చొరవతో ఏళ్ల తరబడి ఇంటి చెర నుండి ఓ భార్యకు విముక్తి లభించింది. వృత్తి రీత్యా లాయర్ కూడా అయిన ఓ భర్త పద్నాలుగేళ్లుగా భార్యను ఇంటికే పరిమితం చేసిన ఘటన విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగింది. కుమార్తెపై బెంగతో తండ్రి మంచం పట్టడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన జనార్థన్, హేమలత దంపతుల కుమార్తె సుప్రియను విజయనగరానికి చెందిన మధుబాబుకు ఇచ్చి 2008లో వివాహం చేసారు. మొదటి ప్రసవానికి మాత్రమే ఆమె పుట్టింటికి వెళ్లింది. తర్వాత నుండి మధుబాబు ఆమెను పుట్టింటి వైపు చూడనివ్వలేదు. ఇంటికే పరిమితం చేశాడు. తర్వాత ఇద్దరు అబ్బాయిలు పుట్టిన విషయాన్ని కూడా సుప్రియ తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశాడు. తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వలేదు. వారితో వచ్చిన చిన్న చిన్న మనస్పర్థలే కారణమని తెలుస్తోంది.

దీనితో సుప్రియ తల్లి హేమలత స్పందన ద్వారా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులను మధుబాబు ఇంటికి పంపినా వారిని కూడా ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు. దీనితో పోలీసులు కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకుని సెర్చ్ వారెంట్‌తో ఇంట్లో ప్రవేశించి సుప్రియను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి సుప్రియను తల్లిదండ్రులకు అప్పగించాలని, త్వరలో రెండు కుటుంబాలను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు. సుప్రియ ఎమ్మే ఇంగ్లీషు చదువుకుని కూడా బయటప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాల్సి వచ్చిందని, అతడు తల్లిదండ్రులను కలవకుండా కట్టడి చేశాడని పేర్కొంది.