కుంభమేళా తొక్కిసలాటపై కాంగ్రెస్ నేతలు ఫైర్..
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. ప్రభుత్వ నిర్వహణాలోపం, వీఐపీలపై ప్రత్యేకశ్రద్ధ వంటి చర్యలతోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా దీనిపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదాయ విదారకంగా ఉందని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విటర్లో తెలియజేశారు. ఈ ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు.


 
							 
							