రెంటికీ చెడ్డ రేవడి గెహ్లాట్
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వైఖరిపై కస్సుమంటోంది. జైపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటుపై ఆ పార్టీ ఆగ్రహంగా ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ దూతలను ఎమ్మెల్యేలు అవమానించడంపై పార్టీ మండిపడుతోంది. ఢిల్లీ పెద్దలు అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు నిరాకరించడంపై ఆ పార్టీ తీవ్ర కోపంగా ఉంది. 90 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించడంతో కాంగ్రెస్ చీఫ్ పోస్టు సైతం దక్కేలా కన్పించడం లేదు. ఎమ్మెల్యేలను తనవైపునకు మళ్లించుకొని కాంగ్రెస్ హైకమాండ్‌ను అవమానించడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. అక్టోబర్ 17న జరగాల్సిన కాంగ్రెస్ చీఫ్ ఎన్నికకు రేపు గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముసలం దెబ్బకు పార్టీ మరో సీనియర్ నేత కమల్‌నాథ్‌ను పార్టీ హైకమాండ్ ఢిల్లీ పిలిపించుకొంది. రాజస్థాన్ వెళ్లి… అశోక్ గెహ్లాట్ మద్దతుదారులతో కమల్ నాథ్ చర్చించే అవకాశం కన్పిస్తోంది.

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను ఎంత మాత్రం ఆమోదించేది లేదంటూ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడటంపై పార్టీ గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేల తీరును గమనించిన అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గే తిరిగి ఢిల్లీ చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికయ్యాక మాత్రమే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. గెహ్లాట్ ఏఐసీసీ చీఫ్‌గా ఉండి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడమంటే అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తోందన్న అభిప్రాయాన్ని మాకెన్ వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని… సోనియా, రాహుల్ గాంధీ మొత్తం పరిణామాలపై అవమానంగా భావిస్తారని మాకెన్ చెప్పారు. ఐతే గెహ్లాట్ విషయంలో పార్టీ తక్కువ అంచనా వేసిందని, అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైందని నిపుణులు చెబుతున్నారు.

ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకోడానికి మొదట్నుంచి గెహ్లాట్ నిరాకరించడాన్ని పార్టీ తీవ్రంగా గర్హిస్తోంది. ఎన్ని పోస్టులైనా నిర్వర్తిస్తానంటూ గెహ్లాట్ చేసిన కామెంట్స్‌కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలకు రాహుల్ నేరుగా సమాధానం ఇవ్వడాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరికి ఒక్క పోస్టే ఇక అంటూ ఆయన తేల్చేశారు. సచిన్ పైలట్ రాజస్థాన్ సీఎం కావడాన్ని ఆమోదించేది లేదంటూ భీష్మించుకున్న గెహ్లాట్… పార్టీలో అసంతృప్తి జ్వాలలు రాజేసి.. తాను తప్పించి ఇంకెవరూ కూడా రాజస్థాన్ హ్యాండిల్ చేయలేరన్న అభిప్రాయాన్ని పార్టీకి పంపిస్తున్నారు. 2020లో పార్టీపై తిరుగుబాటు చేసిన పైలట్‌కు నాడు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య పెరిగినట్టుగా ఎంత మాత్రం కన్పించకపోవడం విశేషం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెహ్లాట్‌ను సమర్థిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్‌ను వదిలించుకోవాలన్న ఆలోచనకు కూడా వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ మాటే వినని వ్యక్తికి ఏఐసీసీ చీఫ్ పదవి కూడా ఎందుకివ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. మొత్తంగా రాజస్థాన్ సీఎం పీఠంపై ఉన్న ఆశ చావక.. గెహ్లాట్ ఆగమాగమవుతున్నాడు.

