బీసీ లను మోసం చేస్తున్న కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో జరిగిన బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న ఆయన, “కాంగ్రెస్ ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లు నిజంగా బీసీల కోసమా, లేక మతపరమైన ఓట్ల కోసమా?” అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన రిజర్వేషన్‌లో ముస్లిం వర్గానికి 10 శాతం కేటాయించడాన్ని ఉద్దేశిస్తూ, “ఆ 10 శాతం మైనారిటీలకు పోతే, బీసీలకు మిగిలేది ఎంత?” అని నిలదీశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యానిస్తూ, గతంలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 23 శాతానికి తగ్గించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్ అంటూ మరోసారి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే నిజమైన కులగణన అవసరమని చెప్పారు. అయితే, కాంగ్రెస్ నిర్వహించిన కులగణన సర్వే పూర్తిస్థాయిలో నిర్వహించలేదని, హైదరాబాద్‌లో 20 శాతం ఇళ్లలో కూడా సర్వే జరగలేదని విమర్శించారు. అంతేకాదు, “ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ వ్యక్తిని కూడా ప్రధాన మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ చేయలేదు” అని తీవ్రస్థాయిలో ఆరోపించారు. యూపీఏ పదేళ్ల పాలనలో బీసీల కులగణన ఎందుకు జరపలేకపోయిందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. “రాహుల్ గాంధీ పార్లమెంటులో ముక్కు నేలకూ రాయాలంటేనే కులగణనపై మాట్లాడిన పరిస్థితి వచ్చింది” అని ఎద్దేవా చేశారు.