ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ కు అలవాటే
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్–బీజేపీ మాటల యుద్ధం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. బీజేపీ ఎంపీ బండి సంజయ్ గెలుపుకు కారణం దొంగ ఓట్లే కారణమని, బీజేపీ ఎన్నికల సమయంలోనే రాముని పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని, సాధారణంగా మాత్రం హిందూ దేవుళ్లను గుర్తు చేసుకోదని ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు . ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కూడా ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా రాముడిని బీజేపీ పార్టీ సభ్యుడిగా చూపిస్తూ ఎగతాళి చేస్తోంది. దేవుని ఉనికినే తిరస్కరించే పార్టీ నాయకుల నుండి ఇంకేమి ఆశించగలం?” అంటూ ఆయన ట్వీట్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముని అవమానించిన పలు ఉదాహరణలను ఆయన గుర్తు చేశారు.
2007లో రామసేతు కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, “రాముడు లేరు, రామాయణం లేదు” అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. దశాబ్దాల పాటు రామమందిర ద్వారాలకు కాంగ్రెస్ తాళం వేసిందని, కానీ బీజేపీ ఆ ద్వారాలు తెరిచి, ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని ఆయన అన్నారు. అంతేకాదు, రాహుల్ గాంధీ రామమందిర ఉద్యమాన్ని ఓడించామని చెప్పి, హిందువులకు ‘హింసాత్మకుల’ అనే ముద్ర వేశారని ఆరోపించారు. అయోధ్యలో జరిగిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ హాజరు కావడానికి నిరాకరించిందని బండి సంజయ్ గుర్తు చేశారు. “భారతీయ ప్రజల విశ్వాసాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏ లో ఉంది. కానీ శ్రీరాముడు మాత్రం ఈ దేశపు డిఎన్ఏ లో ఉన్నాడు. బీజేపీ ఎప్పుడూ ఆ రాముడిని గౌరవిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఎగతాళి చేస్తోంది.”