ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం
ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగానూ అంగీకరించదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు .సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఎత్తిపోతల పథక పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా నదిలో తెలంగాణకు చెందాల్సిన హక్కులను సాధించడంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అలమట్టి ఆనకట్ట ఎత్తు పెంపుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, ఆ నిర్ణయం అమలు అయితే తెలంగాణ రైతాంగానికి అది మరణశాసనం వంటిదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై ఢిల్లీలో బలమైన వాదనలు వినిపించనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.