NationalNews

కేంద్ర ఎన్నికల సంఘానికి… కాంగ్రెస్ ఘాటు సమాధానం

భారతదేశంలోని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 4వ తేదీన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు ఉచితాలకు ఆర్థికంగా అయ్యే ఖర్చు ఆ సొమ్మును ఎక్కడ నుంచి తీసుకు వస్తున్నారు మొదలైన వివరాలను తెలియజేయాలని ఒక లేఖ రాసింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఘాటైన సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో పార్టీల అభిప్రాయాలను కోరడమన్నది ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాల అమలకు అవసరమయ్యే నిధులు వివరాల గురించి కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరడాన్ని ఆయన తప్పుపట్టారు.

ఎన్నికలు స్వేచ్ఛగా నిస్పాక్షికంగా న్యాయంగా నిర్వహించేటట్టు చూడటమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లకు రాజకీయ పార్టీలు ఉచితంగా కంప్యూటర్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు వంటి గృహాపకరణాలను పంపిణీ చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ చాలా సూటిగా సుత్తిమెత్తగా ఎన్నికల సంఘంపై అస్త్రాలను సంధించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రధానమైన ప్రక్రియని వాటిని నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పడిందని ఎన్నికల కమిషన్ పరిధి అంతవరకేనని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కు ఉచితాలకు తేడా ఉందని ఎన్నికల కమిషన్ కు స్పష్టం చేసింది. పార్టీలు అందించే ఉచితాలపై ఓటర్లు ఆధారపడే ధోరణిని ప్రోత్సహించరాదని బీజేపీ స్పష్టం చేసింది.

ఇలాంటి ధోరణుల వల్ల ప్రజాస్వామిక వ్యవస్థ బలహీన పడగలదని హెచ్చరించింది. ఇలాంటివి కంట్రోల్ చేయటం ఎన్నికల కమిషన్ బాధ్యత కాదని ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జరిగేటట్టు ఎన్నికల సంఘం చూడాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కొత్తగా నియమావళిని రూపొందించాలనుకున్నట్టు కనిపిస్తుందని కొత్త నియమావళి రూపకల్పనకు అన్ని పార్టీల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నుంచి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం చేత పార్టీలన్నింటికీ లేఖలు రాయించే బదులు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనాథ్ ప్రశ్నించారు. ఇంకా ఈ విషయంపై మిగిలిన పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.