Home Page SliderNationalNews Alert

124 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితా

కర్ణాటకలో ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇంకా నోటిఫికేషన్‌ వెలువడక ముందే రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్‌ చేసింది. ఇందులో మాజీ సీఎం సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ కూడా ఉన్నారు. సిద్ధ రామయ్య వరుణ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతుండగా.. శివకుమార్‌ కనపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 78 సీట్లు.. జేడీఎస్‌ 37 సీట్లు కైవసం చేసుకుంది. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్‌ సైతం గెలుపొందారు. జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొన్ని రోజులకే బీజేపీ కుట్రలో భాగంగా ఆ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చింది. దాంతో ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ శ్రమిస్తోంది. మరోవైపు బీజేపీ పార్టీ రెబెల్స్‌ బెడదతో సతమతమవుతోంది.