NewsNews AlertTelangana

వారంలో మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక?

Share with

మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థిని వారం రోజుల్లో ఎంపిక చేయాలని రాష్ట్ర పార్టీ నేతలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదేశించారు. పార్టీ సీనియర్‌ నాయకులైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డిలతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేయాలన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కొట్లాడుకోవడం సరికాదని సీనియర్‌ నాయకులకు హితబోధ చేశారు. తాను త్వరలో తెలంగాణాకు వస్తానని, రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఇక నుంచి ప్రత్యక్షంగా పరిశీలిస్తానని చెప్పారు. ఓ వైపు బీజేపీ, మరోవైపు టీఆర్‌ఎస్‌ మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీపై దాడి చేస్తున్నప్పుడు వారిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని, పరస్పర కలహాలతో ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని వివరించారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్లతో ప్రియాంక గాంధీ సమావేశం

సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులతో సోనియా నివాసంలో తొలుత విడివిడిగా భేటీ అయిన ప్రియాంక గాంధీ.. తర్వాత అందరితో కలిసి సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పనితీరుపైనా సీనియర్ల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్‌, మాణిక్కం ఠాగూర్‌ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు పట్టున్న నల్లగొండ జిల్లాలో పార్టీ దిగజారకుండా చూడాలని ప్రియాంక సూచించారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టడం విశేషం.