Home Page SliderNational

ఢిల్లీలో సెపరేట్ సెపరేట్‌గా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ధర్నాలు

వారందరికీ ఉమ్మడి శత్రువు బీజేపీ. కానీ ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు మిత్రులుగా ఉన్నప్పటికీ వారు ఒకరిని ఒకరు కలవలేకపోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులతో వారు విడివిడిగా ఆందోళనలు, విడివిడిగా పోరాటాలు చేస్తూ.. ఎన్నికలకు ముందు ఇండియా కూటమిని మరింత దెబ్బతీస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉన్నప్పటికీ విపక్షాల్లో సయోధ్య సాధ్యం కావడం లేదు. దేశ రాజధానిలో వీధుల్లో బుధవారం అటు లెఫ్ట్ పార్టీలు ఒకలా, కాంగ్రెస్ మరోలా ధర్నాలు చేయడమే ఇందుకు కారణం. కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. కన్నడ ప్రజల ఆత్మగౌరం కోసం పోరాటం చేస్తున్నామంటోంది. కేంద్రం, రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్న… కేంద్రం ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపింది. ఈ నిరసన కన్నడిగులు, కర్ణాటక ప్రయోజనాల కోసం పార్టీలకతీతంగా జరిపే పోరాటమంటూ ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం సైతం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆందోళన చేపట్టగా.. మరోవైపు రేపు ఇదే జంతర్ మంతర్ వద్ద నుంచి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన నిర్వహిస్తోంది.

వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్ల మార్కును దాటుతుందని బిజెపి విశ్వాసం వ్యక్తం చేస్తున్న తరుణంలో మరియు ఇండియా కూటమి.. రాజకీయ వ్యూహాలను మార్చుతోంది. బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో, ఇండియా కూటమి బలంగా ఉన్న ఏరియాల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించేలా నేతలు కసరత్తు తీవ్రతరం చేస్తున్నారు. స్థానికంగా బీజేపీని కట్టడి చేసే ఉద్దేశాలతో వ్యూహాలు పన్నుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల నుండి ఆందోళనలు ఢిల్లీలో జరగడం సామాన్య విషయం ఏమీ కాదు. 16వ ఆర్థిక సంఘం ముందు దక్షిణాది రాష్ట్రాలు సమిష్టిగా వాదనలు విన్పించాలని భావించాయి. ఇందుకు కర్ణాటక కీలకంగా మారనుంది. ఈ మొత్తం పరిణామాలపై కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ విడిగా పోరాడటం వల్ల సమస్య వస్తుంది. కానీ త్వరలో ఇది ఉద్యమంగా మారుతుంది. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వంలో భాగం. కేరళలో, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, వారికి మద్దతిస్తున్నామని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ – రెండు పార్టీలు ఇండియా కూటమిలో కీలక సభ్యులు. కానీ వారి ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. రెండు పార్టీలు కలిసి ఉన్నప్పుడు వేర్వేరు నిరసనలు ఎలా చేస్తాయన్న ప్రశ్న ఉదయిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కోల్‌కతాలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని ఆరోపిస్తూ కేంద్రంపై ధర్నా చేసిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీని తాజా నిరసనలకు ఆహ్వానించారా? అంటూ ఏమో మరి అని సమాధానం వస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేస్తున్నారని మమత గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేరళలో తమ ప్రత్యర్థి లెఫ్ట్ పార్టీయే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విశాల దృక్పథంతో కేరళ ప్రభుత్వానికి సైతం సంఘీభావం ప్రకటిస్తోంది. వాస్తవానికి దేశంలోని విపక్షాల బలం బీజేపీ కంటే ఎక్కువ. విపక్షాల బలం 62 శాతంగా ఉండగా.. వారందరూ విడిపోయి కోట్లాడుకోవడం వల్ల బీజేపీ బలం పెరుగుతోందని ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను కలపడం ద్వారానే ఇండియా కూటమి అస్తిత్వం ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.