బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు..ఇప్పుడెందుకంటే..
అల్లర్లతో అట్టుడుకున్న బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. విద్యార్థులు, పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ అని పిలుచుకునే పారా మిలటరీ దళాలకు చెందిన అన్సార్ సభ్యులు తమ ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి తీసుకురావాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనితో విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. వారు ఢాకా యూనివర్సిటీ నుండి సెక్రటేరియట్ వరకూ మార్చ్ చేపట్టారు. దీనితో అన్సార్ సభ్యులు, విద్యార్థుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇది హింసాత్మకంగా మారడంతో ఈ ఘటనలో 50 మంది గాయాలపాలయ్యారు. చివరకి పోలీసులు, ఆర్మీ దళాల సహాయంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రభుత్వంలో అడ్వైజర్‌గా ఉన్న విద్యార్థి నాయకుడితో సహా పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. తాజా అల్లర్లపై తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ ప్రజలు సంయమనం పాటించాలని, సవాళ్లను అధిగమించాలని సూచించారు.

