NewsNews AlertTelangana

కేసీఆర్‌ కారులో కామ్రేడ్లు

మునుగోడులో బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్న వామపక్షాలు ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ఈ నియోజకవర్గంలో సీపీఐ గతంలో ఏకంగా ఐదుసార్లు విజయం సాధించింది. ప్రస్తుతం సీపీఐ, సీపీఎంలకు కలిపి ఇక్కడ 25 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించే శక్తి వామపక్షాలకు ఉంది. దీంతో వీళ్ల ఓట్ల కోసం ఇటు టీఆర్‌ఎస్‌, అటు కాంగ్రెస్‌ తాపత్రయపడుతున్నాయి.

బీజేపీని ఓడించే సత్తా కలిగిన పార్టీకే మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎం నాయకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లినందున కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు. అందుకే బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న టీఆర్‌ఎస్‌కే మద్దతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెబుతున్నారు. తమ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఏకంగా సీఎం కేసీఆర్‌ కారులోనే మునుగోడుకు వెళ్లారు. కేసీఆర్‌ సభలోనే వామపక్షాల తరఫున టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించనున్నారు.