కారుకు కమ్యూనిస్టులే ఇంధనం..!
మునుగోడులో టీఆర్‌ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ పరువును కమ్యూనిస్టులే కాపాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన మెజారిటీ దీన్ని నిరూపిస్తోంది. రాజకీయ చాణిక్యుడైన కేసీఆర్ ఈ విషయాన్ని ముందే పసిగట్టి కమ్యూనిస్టులను బుట్టలో వేసుకున్నారు. 2018 ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు మద్దతివ్వడం వల్లే ఆ పార్టీ విజయం సాధించిందనే విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ పోల్ మేనేజ్‌మెంట్‌ను పకడ్బందీగా అమలు చేసి.. బీజేపీకి సైద్ధాంతిక శత్రువులైన కమ్యూనిస్టుల వీక్ పాయింట్‌ను క్యాష్ చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు విడిగా పోటీ చేసినా.. కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా టీఆర్‌ఎస్ ఘోరంగా ఓడిపోయేదని ఓటింగ్ సరళిని బట్టి అర్ధమవుతోంది.

చులకనగా చూసిన వాళ్లే ఆదుకున్నారు..
మునుగోడులోని 7 మండలాల్లోనూ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. మునుగోడు నియోజక వర్గంలో తమకు 30 వేల ఓట్లు ఉన్నాయని వామపక్ష నాయకులు చెప్పుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు 10,309 ఓట్ల మెజారిటీనే వచ్చింది. చౌటుప్పల్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందని రాజగోపాల్ రెడ్డి ఆశించారు. కానీ.. బీజేపీ బలంగా ఉన్న జైకేసారం, నెలపట్ల, ఎస్.లింగోటం, కుంట్లగూడెం, మందోల్లగూడెం, చిన్నకోడూరు, పెద్దకోడూరు, పంతంగి మొదలైన గ్రామాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యత సాధించింది. సీపీఐకి పట్టున్న గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోనూ (10-15 రౌండ్లు) టీఆర్‌ఎస్ ఆధిక్యత నిలుపుకుంది. మొత్తానికి ఇంతకాలం ప్రగతి భవన్ గేటు వద్దకు కూడా రానీయకుండా చులకన చేసిన కమ్యూనిస్టులే ఇప్పుడు కేసీఆర్ కారుకు ఇంధనంగా మారారని బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సైతం అంగీకరించడం విశేషం. అయితే.. కమ్యూనిస్టులు మరోసారి ‘కరివేపాకు’ చందంగా మారతారా.. కమ్యూనిస్టులతో కేసీఆర్ సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తారా.. అనేది కాలమే తేలుస్తుంది.