షిండేపై కామెడీ..కునాల్‌కు షాక్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై పేరడీ కామెడీ పాటలు పాడిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. షిండే పరువుకు నష్టం కలిగించారని శివసేన(షిండే) ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు కునాల్ కమ్రాపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణకు మార్చి 31న రావాలని కునాల్‌కు నోటీస్ ఇచ్చారు. అయితే తనకు ప్రాణహాని ఉందని విచారణకు సమయం ఇవ్వాలంటూ కోరిన అతని విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ముంబైలోని హాబిటాట స్టూడియోలో జరిగిన ఈవెంట్‌లో అతని కామెడీ ప్రదర్శన కారణంగా శివసేన యువవిభాగం స్టూడియోపై దాడికి దిగింది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేసి, అనంతరం బెయిల్ లభించగా విడిచిపెట్టారు. ఈ వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు నేతలు అభ్యంతరం చెప్పారు. ఇది జరిగి రెండ్రోజులు కూడా కాకముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పై కూడా వ్యంగ్యంగా కునాల్ పాటలు పాడి కామెడీ చేయడం విశేషం.