కమెడియన్ మనోబాల ఇకలేరు!
తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్, డైరెక్టర్ మనోబాల (69) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. మనోబాల మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు. ఆయన నటించిన తమిళ సినిమాలు డబ్బింగ్ అవడంతో తెలుగు అభిమానులకు చేరువయ్యారు. ఇక తెలుగులో ఆయన మహానటి, దేవదాసు, రాజ్‌దూత్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించారు. 1979లో మనోబాల నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుట్టి వార్పుగల్ ఆయన నటించిన తొలి చిత్రం. సహాయ నటుడిగా వందల సినిమాలు చేసిన ఆయన భారతీ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అనంతరం 1982లో అగయ గంగై సినిమాతో డైరెక్టర్‌గా మారారు. దాదాపు పాతిక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. సినిమాలలో కాకుండా సీరియల్స్‌లో కూడా నటించారు. కొన్ని సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు.

