అర్జంట్‌గా అమెరికా వచ్చేయండి: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సలహా
ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు అర్జంట్‌గా సెప్టెంబరు 21లోపు అమెరికాకు తిరిగిరావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుము లక్ష డాలర్లు విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అనే ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి చాలాకాలంగా హెచ్-1బీ వీసాలను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.