కూటమి ఎమ్మెల్యే నాపై కుట్ర చేస్తున్నారు
అమరావతి :కూటమి ఎమ్మెల్యేగా ఉన్న తనను సొంత కూటమికి చెందిన ఎమ్మెల్యే రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శాసనసభలో జీరో అవర్ సందర్భంగా తన సమస్యను సభ ముందుకు తీసుకొచ్చారు . ‘వైసీపీ నాయకులతో ఎంతైనా పోరాడగలను. కానీ నా పక్క నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కుట్రలకు కొమ్ముకాస్తుంటే నేను ఎమ్మెల్యేగా ఎవరికి చెప్పుకోవాలి?’ అని సభలో ప్రశ్నించారు.
గత పదిరోజులుగా తనపై పత్రికలు, టీవీల్లో తీవ్ర ఆరోపణలతో వార్తలు వస్తున్నాయని, దీని వల్ల తీవ్ర అవమానానికి గురవుతున్నానని మండిపడ్డారు. “గతంలో క్వారీలు తీసుకున్న వారికి కోట్ల రూపాయల జరిమానాలు విధించారు. అయినా మళ్లీ వారికే కాంట్రాక్టులు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి” అని ఈశ్వరరావు స్పష్టం చేశారు.ప్రజా సమస్యలపై పని చేసే తనపై కుట్రలు చేసీ,రాజకీయంగా బలి చేయడం చాలా తప్పని ఎమ్మెల్యే అన్నారు. ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.