Home Page SliderNational

సీఎం సిద్దరామయ్య భార్య సంచలన నిర్ణయం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్తపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించిన ఈ ముడా భూములు తనకు అక్కరలేదని, తిరిగి ముడా సంస్థకే ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ముడా స్థలాల కేటాయింపులో భాగంగా తనకు లభించిన భూములను తిరిగి ఇచ్చేస్తున్నానని, తన భర్తపై ప్రతిపక్షాలు రాజకీయ కుట్రలు చేస్తున్నారని, అనవసరంగా తమ కుటుంబాన్ని వివాదంలోకి లాగుతున్నారని ఆమె ఆవేదన చెందింది. ఆమె సోమవారం ఈ సందర్బంగా ఒక లేఖ రాశారు. “మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఆస్తులు ప్రభుత్వానికి ఇవ్వడంతో ముడా సంస్థకు చెందిన 14 ప్లాట్లు వచ్చాయి. వాటి వల్ల నా భర్త గౌరవానికి భంగం కలిగితే ఇవి నాకు అక్కరలేదు. తిరిగి ముడా సంస్థకే తిరిగి ఇచ్చేస్తున్నా. ఇన్నేళ్ల ఆయన అధికారం నుండి ఏమీ ఆశించని మాకు ఈ ఆస్తులు తృణప్రాయం. నేను ఎవ్వరి అభిప్రాయం తీసుకోకుండా స్వతంత్ర్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. రాజకీయ రంగానికి దూరంగా ఉండే  నాలాంటి ఆడవాళ్లను ఇలాంటి వివాదాల్లోకి లాగొద్దు”. అని లేఖలే పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. “ముడా స్థలాల కేటాయింపులో భాగంగా ఆమెకు వచ్చిన భూములను నా భార్య పార్వతి తిరిగి ఇచ్చేసింది. మాపై వచ్చినవి తప్పుడు ఫిర్యాదులని ప్రజలకు కూడా తెలుసు. నేను ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుదామనుకున్నా. కానీ నా భార్య ఈ రాజకీయకుట్రలు చూసి ఆవేదన చెందింది. అందుకే భూములు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను”. అని పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే ఈ ముడా స్కామ్‌పై మైసూరు లోకాయుక్త అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చిన సోషల్ యాక్టివిస్ట్ స్నేహమయి కృష్ణకు నోటీసును జారీ చేసింది. విచారణకు సహకరించాలని కోరింది. ఈ కేసులో ఏ-1గా సిద్దరామయ్య, ఏ-2గా ఆయన భార్య పార్వతి, ఏ-3గా బావమరిది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు లోకాయుక్త.