Home Page SliderTelangana

సీఎం రేవంత్ అనూహ్య నిర్ణయం !

తెలంగాణ సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సంస్కరణల పంథాలో ఉన్నారు. పరిపాలన మరింత పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా ఉండేలా విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవడానికి ఆయన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడంలేదు. ప్రజా భవన్ (గతంలో ప్రగతి భవన్) అడ్డంకులను ఛేదించి, సామాన్యులకు గేట్లు తెరిచి, ఉన్నత పదవులకు అత్యంత సమర్థులైన బ్యూరోక్రాట్‌లను ఎంచుకుని, కాన్వాయ్‌కు వీఐపీ సంస్కృతిని వదులుకుని, స్థానిక పాలన కోసం ప్రజాపాలన ప్రారంభించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మేధావులు, తెలంగాణ నిపుణులు ఉంటారు. మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌,ఆకునూరి మురళి, ప్రొఫెసర్ హరగోపాల్‌, కె. నాగేశ్వర్‌రావు వంటి వారికి సలహా మండలిలో మేధావులకు చోటు దక్కనుంది. సలహా మండలి చైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సలహా మండలి సభ్యులు కీలక సిఫార్సులు చేయనున్నారు. విద్యపై దృష్టి సారించి మండల స్థాయిలో గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు. సలహా మండలి అంతర్జాతీయ పాఠశాలలను పర్యవేక్షించబోతోంది. ప్రజా భవన్‌కు ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే’ ప్రజా భవన్‌గా నామకరణం చేయనున్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆన్ సోషల్ జస్టిస్ తరహాలో అడ్వైజరీ కౌన్సిల్ పని చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర పరిపాలనకు, నిర్ణయాలకు దూరంగా ఉన్న తెలంగాణ మేధావులు, సామాజిక ప్రముఖుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు,చర్యలు విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.