మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
తెలంగాణ: రాష్ట్రంలోని 65 ఐటీఐలకు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఎటీసీ)గా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,324 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కొత్తగా వచ్చిన కోర్సులివే… మొత్తం 9 లాంగ్ టెర్మ్ కోర్సులు, 23 షార్ట్‌టెర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాలను తగ్గించే బ్రిడ్జి కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుండి కొత్త కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న 5జీ నెట్‌వర్క్ టెక్నీషియన్, 3డీ ప్రింటింగ్, అడ్వాన్స్‌డ్ సీఎన్‌సీ మెకానికల్ టెక్నీషియన్, ఏరోనాటికల్ స్ట్రక్చర్ అండ్ ఎక్విప్‌మెంట్ ఫిల్టర్, టూల్ బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫై, కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామర్, డేటా ఇన్నోవేషన్ అసిస్టెంట్, డ్రోన్ పైలెట్, డ్రోన్ టెక్నీషియన్, ఫైబర్ టు హోం టెక్నీషియన్, జియో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్మార్ట్ అగ్రికల్చర్, స్మార్ట్ సిటీ, స్మార్ట్ హెల్త్‌కేర్, మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్, మల్టీమీడియా యానిమేషన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్, స్మార్ట్‌ఫోన్ టెక్నీషియన్ కం యాప్ టెస్టర్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అసిస్టెంట్, సోలార్ టెక్నీషియన్ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒక్కో ఐటీఐ విద్యాసంస్థ కనీసం ఐదింటిని సెలెక్ట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉపాధి లభించే కోర్సులు అందుబాటులోకి రానుండడంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం. డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరేవారికి ఉపాధి తప్పక దొరుకుతుంది. ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు లభించడం ఖాయం.