వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, ఇతర నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. రోజు రోజుకీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో.. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.అధికారులు మానవీయ కోణంలో సాయం అందించాలన్నారు.

డబ్బుల గురించి ఆలోచించకుండా బాధితులకు అండగా ఉండాలన్నారు. అధికారులు తమకు మంచి చేశారు అన్న మాటే తనకు వినిపించాలని సీఎం చెప్పారు. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వాలని, వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలన్నారు. కచ్చా ఇళ్లు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలన్నారు. తాగునీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలన్నారు. అలాగే ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. వరదల కారణంగా పాముకాట్లు పెరుగుతాయి, వీటికి అవసరమైన మందులను అందుబాటులో చేసుకోవాలన్నారు. వరదనీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యంత పారదర్శకత పద్ధతిలో నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

ఈ కార్యక్రమంలో హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, ఆర్‌అండ్‌బి కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి. కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎ సూర్యకుమారి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జి లక్ష్మీషా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.