ఒడిశా రైలు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 275 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు. శనివారం జరిగిన అత్యవసర భేటీలో సీఎం జగన్ ముగ్గురు IAS లతో కూడిన కమిటీ ని ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఈ కమిటి తో పాటు రాష్ట్ర IT శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని ఘటనా స్థలానికి వెళ్లి పర్యవేక్షించాలని కోరారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఆసుపత్రుల్లో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు .ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని వాల్టెయిర్ డివిజన్ విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళంలో మూడు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చెయ్యడం జరిగింది.
హెల్ప్ లైన్ సేవలు:
విశాఖపట్నం – 0891 – 2746330 & 0891 2744619
విజయనగరం – 08922 – 221202 & 08922 221206
శ్రీకాకుళంలో – 08942 286213 & 08942 286245