15 రోజుల్లో చనిపోయిన వారి ఖాతాల క్లెయిమ్: ఆర్బీఐ
ముంబయి: భారత రిజర్వ్ బ్యాంక్ చనిపోయిన ఖాతాదారుల ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. వీటి కారణంగా కుటుంబ సభ్యులకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించి, వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెస్‌ను అందించడానికి అవకాశం ఉంటుంది. చనిపోయిన వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం సవరించింది. 15 రోజుల గడువులోగా సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తవ్వాలని, ఒక వేళ ఆలస్యమైతే నిర్దిష్ట పరిహారాన్ని నామినీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆ మేరకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిసీజ్డ్ కస్టమర్స్ ఆఫ్ బ్యాంక్స్) డైరెక్షన్స్ 2025‘ కింద సవరించిన నిబంధనలను జారీ చేసింది. వీటిని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని.. 2026 మార్చి 31 కంటే ఆలస్యం కారాదని తెలిపింది.
నామినేషన్ లేదా సర్వైవర్షిప్ క్లాజ్ లో ప్రారంభించిన డిపాజిట్ ఖాతాలకు సంబంధించి, డిపాజిటర్లు మరణించినపుడు నామినీ/సర్వైవర్కు వాటిని బదిలీ చేయడం బ్యాంకుల బాధ్యత అని ఆర్బీఐ తెలిపింది.
ఖాతాలో సహకార బ్యాంకులకు రూ.5 లక్షలు, ఇతర బ్యాంకులకు రూ.15 లక్షలుగా ఈ పరిమితి ఉంది. ఈ పరిమితికి మించి మొత్తం ఉంటే వారసత్వ ధ్రువీకరణ పత్రం లేదా చట్టబద్ధ వారసత్వ ధ్రువపత్రం వంటి అదనపు పత్రాలను కోరవచ్చని తెలిపింది. 15 క్యాలెండర్ దినాల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయకపోతే.. బ్యాంకు ఖాతా విషయంలో 4% వడ్డీ రేటుకు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. సేఫ్
డిపాజిట్ లాకర్/కస్టడీలోని వస్తువుల విషయంలో.. ఆలస్యమైన ప్రతి రోజుకూ రూ.5000 చొప్పున చెల్లించాలి. సేఫ్ డిపాజిట్ లాకర్ లకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. క్లెయిమ్‌లను కూడా బ్యాంకులు 15 రోజుల వ్యవధిలో సెటిల్ చేయాలి.
బ్యాంకులు చనిపోయిన ఖాతాదారుల డిపాజిట్ ఖాతాలు, సేఫ్ డిపాజిట్ లాకర్లు మరియు సేఫ్ కస్టడీ ఆర్టికల్స్ కు సంబంధించిన క్లెయిమ్ లను 15 రోజుల వ్యవధిలో సెటిల్ చేయాలి. ఈ సమయం అన్ని అవసరమైన డాక్యుమెంట్లు అందిన తర్వాత ప్రారంభమవుతుంది.
నామినీ ఉన్న ఖాతాల కోసం: నామినీ లేదా సర్వైవర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లతో క్లెయిమ్‌ను వేగంగా సెటిల్ చేయవచ్చు.
నామినీ లేకుండా ఉన్న ఖాతాల కోసం: రూ. 15 లక్షల వరకు క్లెయిమ్‌లను సులభతరంగా సెటిల్ చేయవచ్చు, అయితే ఎక్కువ మొత్తాల కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం.