మధురైలో ఘనంగా కొనసాగుతున్న ‘చితిరాయ్ తిరువైజ్’ ఉత్సవాలు
మధురైలో వెలసిన మీనాక్షి సుందరేశ్వరుల ఆలయంలో చితిరాయ్ తిరువైజ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న ప్రారంభమైన ఈ ఉత్సవాలు మే 9 వతేదీ వరకు కొనసాగుతాయి. ఈ రోజు 11 వరోజు కావడంతో మీనాక్షి అమ్మవారి ఊరేగింపును చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

క్రిక్కిరిసిన నగర వీధులలో అత్యంత వైభవంగా అమ్మవారి రథం నడుస్తోంది. ఈ ఉత్సవాల సందర్భంగా దేవికి అత్యంత సుందరమైన వజ్రాలు, మణులు పొదిగిన నగలు, కిరీటాన్ని అలంకరించారు. తమిళ సంవత్సరంలోని చితరాయ్ మాసం నుండి ఆడి మాసం వరకు మధురైని మీనాక్షి పరిపాలిస్తుంది. అనంతరం మిగిలిన మాసాలలో సుందరేశ్వరుడు రాజుగా ఉంటాడు. అమ్మవారికి వజ్రకిరీటం అలంకరించి మహారాణిగా ఊరేగించే ఈ వేడుకను చూడడానికి తమిళదేశమంతా కదిలివచ్చింది.

