మెగా అభిమానిని కలవనున్న చిరు..
తాజాగా గాంధీ ఆసుపత్రిలో మెగా చిరంజీవి అభిమాని ‘అడవిదొంగ’ సినిమాను చూస్తూ సర్జరీ చేయించుకున్నారు. అయితే సర్జరీ సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో మెగాస్టార్ చిరంజీవి దృష్టికి చేరింది. వెంటనే ఆయన ఈ విషయంపై స్పందించి ఆమె వివరాలను తెలుసుకోమని తన పీఆర్వోని గాంధీ ఆసుపత్రికి పంపారు. ఆయన హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావును కలవగా సర్జరీలో పాల్గొన్న డాక్టర్లను కలిసి ఆపై పేషంట్‌తో మాట్లాడారు. ఆమె చిరంజీవికి విరాభిమానినని ఆయన సినిమాలన్నీ చూశానని చెప్పింది. దీంతో పీఆర్‌వో అక్కడి నుండే ఫోన్ చేసి విషయాన్ని చిరంజీవికి తెలిపారు. కాగా దీనిపై స్పందించిన చిరంజీవి త్వరలో వీలు చూసుకొని ఆమెను కలుస్తానని తన పీఆర్‌వోతో చెప్పారు. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ రాజారావుకు తెలియజేశారు. ఆయితే ఈ సర్జరీ విజయవంతం కావటంతో తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆపరేషన్ చేసిన డాక్టర్లను అభినందిస్తూ తన ట్వీటర్‌లో ట్విీట్ చేశారు.
సాధారణంగా ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ముందుగానే పేషెంట్ భయపడకుండా ఉండటానికి కౌన్సిలింగ్ ఇస్తూంటారు. ఆపరేషన్ తో రోగి ఆరోగ్యం మెరుగుపడుతుందని ముందుగానే ప్రిపేర్ చేస్తారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రక్రియతో పేషెంట్‌కి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడాడు. స్పృహలో ఉన్న పేషెంట్‌కి సినిమా చూపిస్తూ మెదడులోని కణితిని తొలగించి వైద్యులు వెరీ గుడ్ అనిపించుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి జిల్లాకు చెందిన వృద్ధురాలు(60) ఇటీవల అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. న్యూరాలజిస్టులు ఆమెకి పరీక్షలు నిర్వహించి మెదడులో ట్యూమర్ (ట్యూమర్) ప్రమాదకరంగా పెరుగుతోందని గుర్తించారు. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని లేకుంటే అది ప్రమాదంగా మారి ప్రాణనష్టానికి దారి తీస్తుందని కుటుంబ సభ్యులుకు తెలిపారు.

మొత్తం ఆపరేషన్‌లో రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని భావించి న్యూరోసర్జరీ, అనస్థీషియా వైద్యులు కలిసి మెలకువగా క్రానియోటమీ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆందోళన చెందిన ఆమెకి వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది ధైర్యం చెప్పారు. అనంతరం ఆపరేషన్ గదిలోని టేబుల్‌పైకి తీసుకొచ్చి మత్తు మందు ఇచ్చారు. మెదడు ఎగువ భాగాన్ని తెరవడానికి ఆపరేషన్ సమయంలో, మూర్ఛలు మరియు పక్షవాతంతో సహా వివిధ సమస్యలు వస్తాయని స్పృహలో ఉన్న ఆమెతో నిరంతరం మాట్లాడుతూ.. యాక్టివ్‌గా ఉంచారు. ఆమెకు ఆపరేషన్ చేయటం మొదలు పెట్టారు. ఆపరేషన్ సమయంలో ఒత్తిడికి గురై స్పృహ కోల్పోకుండా ఉండటానికి ఆమెతో మాట్లాడూతూ ఉన్నారు. ఈ సందర్భంగా తనకు చిరంజీవి, నాగార్జున అంటే చాలా ఇష్టమన్నారు. చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమాని కంప్యూటర్ ట్యాబ్‌లో తనకి చూపించారు. ఆమె సినిమా చూస్తుండగానే వైద్యులు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మెదడులోని మిగిలిన భాగాలకు ఎలాంటి హాని కలగకుండా కణితిని తొలగించారు. ఈ రకమైన ఆపరేషన్‌ను వైద్యపరంగా ‘అవేక్ క్రానియోటమీ’ అంటారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

