పాక్‌కు హ్యాండిచ్చిన చైనా
పాకిస్థాన్ తనకు మంచి మిత్రపక్షంగా భావిస్తున్న చైనా కీలక సమయంలో హ్యాండిచ్చింది. పాక్‌లో భారీ వర్షాలు, వరదలతో వెయ్యి మందికి పైగా చనిపోయారు. మరో 1500 వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. 3.3 కోట్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మృతుల్లో 350 మంది చిన్నారులే ఉండటం బాధాకరం. ఇప్పటికీ వందలాది గ్రామాల్లో లక్షలాది మంది వరద నీటిలోనే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి అని పాక్ వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని 149 వంతెనలు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సాయం అందించిన భారత్
ఇంతటి హృదయ విదారక పరిస్థితిలో ఇతర దేశాల ఆపన్న హస్తం కోసం పాక్ పాలకులు ఎదురు చూస్తున్నారు. ఇస్లామిక్ దేశాలు పాక్‌కు సాయం అందిస్తున్నాయి. భారత్ కూడా కూరగాయలు, పండ్లను పాక్‌కు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. పొరుగునే ఉన్న చైనా మాత్రం పాక్ దుస్థితిపై విచారం వ్యక్తం చేయడం మినహా ఎలాంటి సాయం అందించలేదు. అప్పులు ఇవ్వడంలో చూపే ఆసక్తి.. సాయం అందించడంలో చైనా కనబర్చడం లేదని పాక్‌లోని ప్రభుత్వ, విపక్ష నేతలు మండి పడుతున్నారు.

భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
మరోవైపు పాక్‌లో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో టొమాటో ధర రూ.500 (పాక్ కరెన్సీలో)కు, ఉల్లిపాయ ధర రూ.400కు ఎగబాకింది. వాతావరణ మార్పుల వల్లే వరదలు పోటెత్తాయని చెబుతున్నపాక్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే.. ఇదంతా పాక్ స్వీయ అపరాధం అని విమర్శకులు అంటున్నారు. డ్యామ్‌లు, వాటర్ రిజర్వాయర్లపై దృష్టి సారించిన పాక్ ప్రభుత్వ విధానాల వల్లే ఈ దుస్థితి అని అక్కడి విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.